బషీర్బాగ్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ లో బీసీలకు తీరని అన్యాయం చేసిందని తెలంగాణ బీసీ జేఏసీ చైర్మన్, ఎంపీ ఆర్.కృష్ణయ్య విమర్శించారు. రాష్ట్రంలో బీసీ ఉద్యమం బలంగా ఉన్న తరుణంలో బడ్జెట్ కేటాయింపులు సరిగా లేకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిదర్శనమన్నారు. హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో 14 బీసీ సంఘాల అత్యవసర సమావేశం జరిగింది.
బడ్జెట్ లో రూ.3.24 లక్షల కోట్లలో బీసీలకు రూ.12,511 కోట్లు మాత్రమే కేటాయించి అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల హామీతో పాటు కామారెడ్డి డిక్లరేషన్ లో ప్రతి ఏటా రూ.20 వేల కోట్లు కేటాయిస్తామని ప్రకటించిందని గుర్తు చేశారు. వెంటనే బడ్జెట్ ను రివ్యూ చేసి రూ.20 వేల కోట్లకు పెంచాలన్నారు.
బీసీ కార్పోరేషన్, బీసీ కుల ఫెడరేషన్లకు రూ.10 వేల కోట్లు కేటాయించాలని కోరారు. ఒక్కో బీసీ కుటుంబానికి రూ.20 లక్షలతో పాటు 80 శాతం సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలన్నారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నీల వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.
